తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనా చారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ పట్టణ ప్రభుత్వాసుపత్రిలో మరియు  విశ్వకర్మ కార్పెంటర్స్  యూనియన్ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తమ్ముడు కొడుకైన నాగార్జునా చారి చెప్పారు. *ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని*.. ఆ తర్వాత *మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని* నాగార్జునా చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని నాగార్జునా తన పెదనాన్న సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చూపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక… అశేష పీడిత ప్రజానీకం కోసమే వెచ్చించాడన్నారు. మిర్యాలగూడలోనే గాక నల్లగొండ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తిగా.. వేలాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి అమరుడయ్యారని ఆచారిని స్మరించుకున్నారు. మిర్యాలగూడలో జరిగిన ఆచారి జయంతి వేడుకలను విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సహకారంతో ఆచారి ఫౌండేషన్ ఎంతో శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిందని నాగార్జున చారి చెప్పారు.

Skip to toolbar